బైబిలులో ప్రభువైన యేసు జననవిధానము ఎంతో చక్కగా చెప్పబడింది.
ప్రభువైన యేసు జననమునకు అనేక వందల సంవత్సరములకు మునుపే దేవుడు ఒక ప్రవక్త ద్వారా ప్రజలకు ఈ విధముగా ప్రకటింపచేసారు.
“కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.”- యెషయా 7:14
దేవుడు మన పాపముల నుండి మనలను విడిపించి, దేవుని యొద్దకు తిరిగి తీసికొని వచ్చే ఒక రక్షకుని, లేక విమోచకుని పంపిస్తానని ఎన్నోసార్లు బైబిలులో వాగ్దానము చేసారు.
దేవుడు నిర్ణయించిన సమయము వచ్చినప్పుడు ఒక భక్తిగల ఇశ్రాయేలీయురాలైన ఒక కన్యయైన మరియ యొద్దకు దేవుడు ఒక దేవదూతను పంపారు.
ఆ దేవదూత మరియతో ‘నీవు ఒక కుమారుని కందువు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడును’ అని చెప్పెను.
అప్పుడు మరియ దేవుని అద్భుతకార్యము వలన గర్భవతియాయెను. ఆ సమయములో యోసేపు అను ఒక వడ్లవానితో వివాహమునకై మరియ ప్రధానము చేయబడి యుండెను. మరియను భార్యగా చేసుకోమని దేవదూత యోసేపునకు చెప్పెను. యోసేపు దేవునికి లోబడెను.
తన ప్రజలను తమ పాపములనుండి రక్షించును గనుక ఆ బాలునికి “యేసు” అని పేరును పెట్టమని దేవుడు వారికి చెప్పెను. ‘యేసు’ అంటే ‘దేవుడు రక్షిస్తాడు’
పరిశుద్దుడును, పవిత్రుడును అయిన యేసుప్రభువు పాపము, మలినముతో నిండియున్నఈ లోకమునకు, పరలోకములో తన మహిమను వదిలి నిన్ను, నన్ను రక్షించుటకు మానవ స్వరూపమును ధరించి దేవుడు నిర్ణయించిన సమయములో వచ్చెను.
అది ఎంతో ఆశ్చర్యముకదా? మనము ఊహించగలమా? ఇది దేవుని కార్యము.
తదుపరి పాఠములలో ప్రభువైన యేసు జననమును గూర్చిన చక్కనైన కధను చదువుకుందాము.
ప్రార్ధన: సర్వశక్తిగల దేవా! ఆశ్చర్యకరమైన మీ రక్షణ ప్రణాళికను బట్టి మీకు వందనములు. మమ్ములను రక్షించుటకు మీ స్వంత కుమారుని పంపినందుకు మీకు వందనములు. ఆమెన్!