దేవుడు సృష్టించిన వారిలో మొట్టమొదటి మనుష్యులు ఆదాము మరియు హవ్వ. బైబిలులోని ప్రధమ గ్రంధమైన ఆదికాండములో వీరి గురించి చెప్పబడింది. దేవుడు వారిని తన స్వరూపములో నిర్మించెను. ఎదేను అను సౌందర్యవంతమైన వనమును దేవుడు వారికి జీవించుటకు ఇచ్చెను.
దేవుడు ప్రతి రోజు, వారితో కలసి నడచుటకును, మాట్లాడుటకును వచ్చేవారు.
అది మీరు ఊహించగలరా? సర్వశక్తిగలదేవుడు, భూమ్యాకాశముల సృష్టికర్త, తాను సృజించిన మనుష్యులతో సమయము గడుపుటకు ఇష్టపడేవారు. ఎందుకంటే వారు ఆయనకు ప్రత్యేకమైన వారు గనుక!
అటు పిమ్మట ఆదాము, హవ్వ పాపము చేసారు. దేవునికి వారు అవిధేయత చూపారు. వారు దేవుని దృష్టిలో తప్పు చేసామని గ్రహించారు. అందుకే దేవుడు వారిని దర్శించినపుడు వారు పరుగెత్తి దాగుకొన్నారు!
ఆ పాపము వలన దేవునితో వారికి గల సంతోషకరమైన సంబంధము తెగిపొయినది. వారు దేవునితో గల సన్నిహిత సంబంధమును పోగొట్టుకున్నారు. వారి పాపము వలన దేవుడు వారిని తన సన్నిధి నుండి పంపివేసారు. పరిశుద్ధుడు, పవిత్రుడును అయిన దేవుడు పాపకరమైనదేదియు తన వద్ద ఉండుట సహించరు.
ఈ విధముగా పాపము ఈ లోకమునకు వచ్చింది. మన మొదటి తల్లిదండ్రుల పాపము కారణముగా మనము పాపము చేయవలెన్నన్న కాంక్షతో జన్మిస్తాము. దాని కారణముగానే దేవునికి వ్యతిరేకముగా క్రియలను, పాపములను చేస్తాము. పాపము, మరియు దాని పరిణామము ఎంతో భయంకరమైనవని మనము ఈ లోకములో చూస్తున్నాము. ఈ చీకటి పాపములు మనలను మన పరిశుద్ధుడైన దేవుని నుండి విడదీస్తాయి. మనము పరిశుద్ధుడైన, పవిత్రుడైన దేవునికి దగ్గరగా వెళ్ళలేము.
దేవుడు రోమీయులకు వ్రాసిన పత్రిక 3:23 లో “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని చెబుతున్నారు.
ప్రార్ధన: ప్రియమైన దేవా! నా పాపములకై నేను క్షమాపణ అడుగుచున్నాను, నన్ను దయయుంచి క్షమించండి. నేను మీకు దగ్గరగా ఉండవలెనని కోరుచున్నాను. ఆమెన్!