మీరు ప్రభువైన యేసు క్రీస్తును అనుసరించుటకు నిశ్చయించుకొన్నారు. నేను ఏ విధంగా ప్రార్ధించాలి అని ఆలోచిస్తున్నారా?
ప్రార్ధన అంటే దేవునితో మాట్లాడుట. ప్రతి పాఠముచివర, ప్రభువైన యేసుకు ఒక ప్రార్ధన అమర్చబడి ఉంది. మీరు ఆ ప్రార్ధనను మనసులో కానీ, బహిరంగముగా గాని చెప్పియుంటే మీరు ఇదివరకే ప్రార్ధన చేయటము ప్రారంబించారు.
యేసు ప్రభువును నేను వివిధ పద్ధతులలో ప్రార్ధించుదును. నేను ఆయనను స్తుతించాలి అని అనుకొన్నప్పుడు, ఒక నెమ్మదియైన స్థలమును ఎన్నుకొని, మోకాల్లూని, చేతులు జోడించి, ఆయన ముందు తలవంచి, నా కన్నులు మూసికొని, నా అలోచనలను ఆయనపై కేంద్రీకరించెదను. ఈ విధముగా ప్రార్ధించుట నాకు ఇంటిలోను, చర్చిలోను మాత్రమే వీలుపడును.
వేరే సమయములలో, నేను కేవలము తల వంచి కన్నులు మూసుకొని ప్రార్ధించెదను.నేను స్కూలులో ఉన్నప్పుడు గాని, కళాశాలలో ఉన్నప్పుడు గానీ, ఇంటిలో పని చేయునప్పుడు గానీ, ప్రయాణము చేయునప్పుడు గానీ, మరెప్పుడైనా సరే, ఆయన సహాయము నాకు కావలసి వచ్చినప్పుడు, నాకు ఎవరితోనైనా మాట్లాడాలి అనిపించినప్పుడు నేను నా హృదయములో ప్రార్ధించుదును.
మన తల్లితో, తండ్రితో మాట్లాడినట్లు, మన స్నేహితులతో మాట్లాడినట్లు, యేసు ప్రభువుతో మనము మాట్లాడవచ్చు. మనము ఆయన దగ్గరకు వచ్చి, ఆయనతో మాట్లాడవలెనని, మన హృదయములోని విషయములన్నియు తెలుపవలెనని ఆయన కోరుచున్నారు.
ఉదయమున నేను నిద్ర లేచినప్పుడు ఆయనతో మాట్లాడుదును. రాత్రి పడుకొనబోవునప్పుడు ఆయనతో మాట్లాడుదును. ఆయన నాకు శాంతిని, సంతోషమును అనుగ్రహించును.
ప్రార్ధన మనకు దేవుని వద్ద నుంచి వచ్చిన గొప్ప బహుమానమే. ఆయన దేవుడైనప్పటికీ మన మొర వినలేనంత దూరముగా ఉండరు.
బైబిలులో కీర్తన 66:19 లో ‘నిశ్చయముగా నా దేవుడు నా మొరను అంగీకరించియున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు’ అని దేవుని యొద్ద నుండి మనకు అభయముంది.
ప్రార్ధన: ప్రియమైన యేసు ప్రభువా, నాకు మీతో మాట్లాడుట ఎప్పుడు అవసరమైనా నాకు దగ్గరగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. ఆమెన్!